పోడూరు మండలం జగన్నాథపురం గ్రామం వద్ద జరిగిన దుర్ఘటన మూడుకుటుంబాల్లో కారుచీకట్లు కమ్మేలా చేసింది. తీరని విషాదాన్ని మిగిల్చింది. బుధవారంతెల్లవారుజామున తూర్పుగోదావరి జిల్లా
పోడూరు: పోడూరు మండలం జగన్నాథపురం వద్ద బుధవారం వేకుజామున 4 గంటల సమయంలో కాలువలోకి కారు దూసుకెళ్లిన ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. రొయ్యల సీడ్ కోసం తూర్పుగోదావరి జిల్లా ఒంటిమామిడి వెళ్లి తిరిగి కారులో వస్తుండగా మార్గమధ్యంలో జగన్నాథపురం వద్ద అదుపుతప్పి కుడివైపున ఉన్న నరసాపురం ప్రధాన కాలువలోకి దూసుకెళ్లి బోల్తాకొట్టింది. కారులో ప్రయాణిస్తున్న యలమంచిలి మండలం కాజ గ్రామానికి చెందిన కొప్పినీడి సురేష్ (25), వీరవాసరం మండలం మత్స్యపురికి చెందిన చౌదుల కాశీవిశ్వనాథం (22), చింతా అయ్యన్న అలియాస్ చిట్టియ్య (40) మృతి చెందారు. మృతుల్లో సురేష్, కాశీ విశ్వనాథం స్వయానా బావ, బావమరుదులు. కాలువలోకి పల్టీకొట్టిన కారు నీటిలో మునిగి చక్రాలు పైకి ఉండటంతో డోర్లు తెరుచుకోలేదు. దీంతో లోపల ఉన్నవారు బయటకు వచ్చే మార్గం లేక అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదం జరిగిన కొంతసేపటికి ఆ మార్గంలో మార్నింగ్ వాకింగ్‌కు వెళుతున్న వ్యక్తులు చూసి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం తెలిసిన వెంటనే పాలకొల్లు రూరల్ సీఐ డి.వెంకటేశ్వరరావు, పోడూరు, ఆచంట ఎస్సైలు బి.సురేంద్రకుమార్, రాజశేఖర్, సిబ్బందితో కలసి ఘటనా ప్రదేశానికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసు సిబ్బంది సహకారంతో కారును ఒడ్డును చేర్చి మృతదేహాలను బయటకు తీశారు. నిద్రమత్తు వల్లే కారు అదుపు తప్పి ప్రమాదం చోటుచేసుకుందని పోలీసులు చెబుతున్నారు. ప్రమాద సమయంలో కారు నడుపుతున్న వ్యక్తి ఎవరు అనేది స్పష్టంగా తెలియలేదు. సురేష్ కారు నడుపుతున్నట్టు పోలీసులు చెబుతున్నారు. సురేష్ జేబులో ఉన్న ఆధార్‌కార్డ్, సెల్‌ఫోన్‌లోని నంబర్ల ఆధారంగా పోలీసులు కుటుంబసభ్యులకు సమాచారమిచ్చారు. గ్రామ వీఆర్‌ఓ ఎం.శ్రీకృష్ణ ఫిర్యాదు మేరకు పోడూరు ఎస్‌ఐ బి.సురేంద్రకుమార్ కేసు నమోదు చేశారు. పాలకొల్లు రూరల్ సీఐ డి.వెంకటేశ్వరరావు కేసును దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పాలకొల్లు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.